NEWSTELANGANA

సాంస్కృతిక..వార‌స‌త్వ సంప‌దను ప‌రిర‌క్షిస్తాం

Share it with your family & friends

ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్ప‌ష్టం

హైద‌రాబాద్ – తెలంగాణ సాంస్కృతిక, వారసత్వ సంపద పరిరక్షణను ప్రజా ప్రభుత్వం ఒక బాధ్యతగా భావిస్తుందని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలను చేపడుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రసిద్ద కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్దరణ విజయవంతంగా పూర్తయిన సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అఘా ఖాన్ ట్ర‌స్ట్ ఫ‌ర్ క‌ల్చ‌ర్ (Aga Khan Trust for Culture ) సహకారంతో ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ చేపట్టారు. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు.. ఇలా వేల ఏండ్ల పాటు ఆయా రాజ్యాలు తెలంగాణపై తమదై ప్రత్యేక సాంస్కృతిక ముద్రను వేశాయని రేవంత్ రెడ్డి అన్నారు.

వీటితో పాటు వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు మన తెలంగాణ నిలయంగా ఉందని గుర్తు చేశారు. శతాబ్దాలుగా హైదరాబాద్ నగరం ‘గంగా-జమునా తెహజీబ్’గా బహుళ జాతులు, సంస్కృతుల మేళవింపుతో సామరస్యాన్ని, సహజీవనాన్ని చవి చూసిందన్నారు సీఎం. ఈ సాంస్కృతిక వారసత్వం మనల్ని సగర్వంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు.