జనం కోసం ‘జన్ సురాజ్’ పార్టీ – పీకే
అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ప్రకటన
బీహార్ – ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త , ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. గత కొంత కాలంగా బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. మరో వైపు తన సలహాలు, సూచనలు ఆయా పార్టీలకు, నేతలకు ఇస్తూనే ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు.
తాజాగా తాను కూడా ఓ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దానికి జన్ సురాజ్ అని పేరు కూడా ఖరారు చేశారు. తాను నిత్యం అభిమానించే జాతిపిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ (మహాత్మా గాంధీ) పుట్టిన రోజు అక్టోబర్ 2న ప్రకటిస్తానని వెల్లడించారు ప్రశాంత్ కిషోర్.
ఈ దేశంలో మార్పు రావల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి ఆ మార్పు తన ప్రాంతం నుంచే మొదలు పెట్టాలని తాను నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్బంగా ప్రకటించారు ప్రశాంత్ కిషోర్.
ప్రజాస్వామ్యం ఇవాళ మార్కెట్ లో వస్తువు లాగా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం పదే పదే పరిహాసానికి లోనవుతోందని వాపోయారు పీకే. దీని కోసమే ముందు జనంలో మార్పు తీసుకు వస్తేనే డెమోక్రసీకి ఉన్న శక్తి ఏమిటో అర్థం అవుతుందన్నారు.
జన్ సురాజ్ తో తాను చేపట్టిన ప్రజా యాత్రకు భారీ స్పందన లభించిందన్నారు పీకే. ఉద్యమంగా ప్రారంభమైన ఈ ప్రయత్నం రేపొద్దున పార్టీగా మార బోతోందని చెప్పారు. 2025లో బీహార్ లో జరిగే శాసన సభ ఎన్నికల్లో 243 స్థానాలలో జన్ సురాజ్ పోటీ చేస్తుందని ప్రకటించారు .