మీ అహంకారమే పతనానికి కారణం
జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కేవలం తనను ట్రోల్ చేస్తూ చంద్రబాబుకు వంత పాడుతున్నానంటూ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు. సోమవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా..? మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టలంటూ ఎద్దేవా చేశారు. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడని అన్నారు.
సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది .. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉందన్నారు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించ కూడదని ఎక్కడైనా ఉందా..? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉందన్నారు వైఎస్ షర్మిల. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదన్నారు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లక పోవడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు.
చట్ట సభను గౌరవించక పోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నామని అన్నారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది నేనేని అన్నారు.
అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చక పోయి ఉంటే ఈరోజు వైఎస్సార్ కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదని గుర్తు చేశారు. వైఎస్సార్ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, రామకృష్ణా రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు.