బీజేపీ..జేడీఎస్ పాదయాత్రకు నో ఛాన్స్
స్పష్టం చేసిన సీఎం సిద్దరామయ్య
బెంగళూరు – కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన ప్రకటన చేశారు. బీజేపీ, జేడీఎస్ తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. కాగా వాల్మీకి బోర్డు, ముడాలలో అవకతవకలు జరిగాయని, దీనిలో సీఎం హస్తం ఉందంటూ భారతీయ జనతా పార్టీ, జేడీఎస్ పార్టీలు సంచలన ఆరోపణలు చేశాయి. ఇందుకు సంబంధించి దీనిపై విచారణ చేపట్టాలని, సీఎం రాజీనామా చేయాలని కోరుతూ బీజేపీ, జేడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టాలని పిలుపునిచ్చాయి.
ఈ పాదయాత్ర ఆగస్టు 3 నుంచి 7వ తేదీ వరకు బెంగళూరు నుండి మైసూరు వరకు చేపట్టాలని రెండు పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. పాదయాత్ర అనంతరం ఆగస్టు 10న మైసూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు ఆయా పార్టీల నేతలు.
ఇదిలా ఉండగా పర్మిషన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా, దీనికి అనుమతి ఇవ్వడం కుదరదని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం సీఎం సిద్దరామయ్య పాదయాత్రపై స్పందించారు. లా అండ్ ఆర్డర్ దృష్ట్యా పర్మిషన్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. వాల్మీకి బోర్డులో రూ. 187 కోట్ల స్కాం జరిగిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణకు ఆదేశించామన్నారు.