NEWSNATIONAL

సామాన్యుల‌కు మంగ‌ళం డ‌బ్బున్నోళ్ల‌కు అంద‌లం

Share it with your family & friends

లోక్ స‌భ ప్ర‌తిపక్ష నేత రాహుల్ గాంధీ కామెంట్

ఢిల్లీ – పార్ల‌మెంట్ లో నిప్పులు చెరిగార లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ. సోమ‌వారం కేంద్రం ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్ 2024పై తీవ్రంగా స్పందించారు. ఇది పేద‌ల‌కు దూర‌మైన బ‌డ్జెట్ అని, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు.

ఎవ‌రి కోసం ప్ర‌వేశ పెట్టారో ప్ర‌ధాన మంత్రి మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎవ‌రి ప్రయోజ‌నాల‌ను కాపాడేందుక‌ని మీరు ఈ బ‌డ్జెట్ ను త‌యారు చేశారో 143 కోట్ల ప్ర‌జ‌లు స‌భ సాక్షిగా తెలుసు కోవాల‌ని అనుకుంటున్నార‌ని అన్నారు రాహుల్ గాంధీ.

దేశాన్ని ఇప్ప‌టికే కొంద‌రు వ్యాపార‌స్తులు, పెట్టుబ‌డిదారులు, కార్పొరేట్ కంపెనీలు ప‌ట్టి పీడిస్తున్నాయ‌ని, వారికి మేలు చేకూర్చేందుకే దేశాన్ని త‌మ కంట్రోల్ ఉంచుకున్న ఆరుగురు వ్య‌క్తులు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌తిప‌క్ష నేత‌.

ఆ ఆరుగురు ఎవ‌రో కాద‌ని ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ , హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ , ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ , వ్యాపార‌వేత్త‌లు అదానీ , అంబానీలంటూ మండిప‌డ్డారు రాహుల్ గాంధీ.