నేడు ఎస్ఎస్ఏ ఉద్యోగుల ముట్టడి
మాట మార్చిన ప్రభుత్వం సర్వత్రా ఆగ్రహం
హైదరాబాద్ – తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తమ బతుకులు మారడం లేదంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో పని చేస్తున్న ఉద్యోగులు. పలుమార్లు కలిసినా, వినతి పత్రాలు సమర్పించినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము కూడా ప్రభుత్వ టీచర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నామని అయినా గుర్తింపునకు నోచు కోవడం లేదని మండి పడుతున్నారు. ఎన్నికల సందర్బంగా కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండదని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట మారుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
తమను పర్మినెంట్ చేయాలని, వేధింపుల నుంచి రక్షించాలని , మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని కోరుతూ జూలై 30 మంగళవారం తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీని ముట్టడించాలని కోరారు. ఈ మేరకు ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా తరలి రావాలని సంఘం నేతలు విన్నవించారు.