ఐటీ కంపెనీలపై నియంత్రణ ఉండాలి
చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్ – సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసన సభలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలు లేవదీశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు.
ఇదే సమయంలో కూనంనేని సాంబశివ రావు సాఫ్ట్ వేర్ కంపెనీలలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరినీ విస్తు పోయేలా చేసింది. చాలా మందిలో ఐటీ కంపెనీ ఉద్యోగుల పట్ల ఓ దురభిప్రాయం ఉందన్నారు. అదేమిటంటే వారంత అదృష్ట వంతులు లేరని అనుకుంటారని , కానీ వారు రోజంతా 14 నుంచి 18 గంటల దాకా పనులలో నిమగ్నమై ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ వారు చాలా నరకం అనుభవిస్తుంటారని, ప్రాజెక్టుల టార్గెట్ పూర్తి చేయలేక నానా తంటాలు పడుతుంటారని అన్నారు ఎమ్మెల్యే. రోజంతా ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఆయా ఐటీ, లాజిస్టిక్ కంపెనీలపై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కూనంనేని సాంబ శివ రావు డిమాండ్ చేశారు.