జగన్ భూ దోపీడీపై సర్కార్ ఫోకస్
మంత్రి అనగాని సత్య ప్రసాద్
అమరావతి – రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు అడ్డగోలుగా గత జగన్ రెడ్డి హయాంలో అన్యాక్రాంతం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ రెవిన్యూ శాఖపై సమీక్ష చేపట్టారని తెలిపారు. ఇందులో ప్రధానంగా ఎక్కడెక్కడ భూములు ఆక్రమించుకున్నారనే దానిపై విచారణ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రధానంగా ప్రజా దర్బార్ లో ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించిన సమస్యలపైనే ఎక్కువగా తమకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు అనగాని సత్య ప్రసాద్. వైసీపీ ప్రభుత్వంలో భూములను అడ్డు పెట్టుకొని దోపిడీ చేశారని ఆరోపించారు
. జగన్ ప్రభుత్వ అక్రమాలపై ఇవాళ సీఎం చంద్రబాబు నేతృత్వంలో సుదీర్ఘంగా సమీక్షించామని చెప్పారు. మదనపల్లి ఫైళ్లు ఎంత దారుణంగా ఉన్నాయో చూశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకుల చేతుల్లో అధికారులు కీలుబొమ్మలుగా ఉన్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రెవెన్యూ కార్యాలయాలకు భద్రత లేకుండా పోయిందన్నారు.
ఈ విషయంపై ప్రభుత్వ కార్యదర్శి అక్కడికి వెళ్లి అధ్యయనం చేశారని అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైనా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.