పరిశ్రమలు..పెట్టుబడుల కోసం కొత్త పాలసీ
తయారీపై ఫోకస్ పెట్టామన్న చంద్రబాబు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఆయన సీఎంగా కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమీక్షలతో హోరెత్తిస్తున్నారు. బుధవారం సచివాలయంలో రివ్యూ చేశారు చంద్రబాబు నాయుడు.
ఈ మేరకు ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు ఆకర్షించేందుకు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పరిశ్రమలు, ఇన్వెస్ట్ మెంట్స్ కు సంబంధించి కొత్త పాలసీ తయారు చేయాలని స్పష్టం చేశారు సీఎం.
గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. 100 రోజుల్లో కొత్తగా నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఇ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్ టైల్ పాలసీలు తీసుకురావాలని అన్నారు.
అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్ గా చెయ్యాలనే లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని అన్నారు సీఎం.
కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త క్లష్టర్స్ ఏర్పాటు చేయాలని..ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కృష్ణపట్నం, నక్కపల్లి, ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్స్ ప్రోగ్రెస్‌పై చర్చించారు.