రేవంత్ దిష్టి బొమ్మల దహనం
పిలుపునిచ్చిన బీఆర్ఎస్
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డిలను ఉద్దేశించి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి , మరీ దిగజారి మహిళలని చూడకుండా దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. సీఎం వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్బంగా కేటీఆర్.
ఆడబిడ్డలపై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కండ కావరం ఎక్కి మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేయాలని సూచించారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా మాట్లాడటం దారుణమన్నారు కేటీఆర్.