వంగలపూడి అనిత ప్రజా దర్బార్
ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి సర్కార్ ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులంతా తమ తమ నియోజకవర్గాలలో దృష్టి సారించారు. మరో వైపు బాధితులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రజా దర్భార్ కు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు తన తనయుడు, విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ను ప్రారంభించారు. ప్రతి రోజూ ఆయన బాధితులతో కలుస్తున్నారు.
మరో వైపు మంత్రులు సైతం వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. పంటలు కోల్పోయిన రైతులకు అండగా నిలిచారు. మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఏకంగా మర పడవల్లో ప్రయాణం చేసి , కొట్టుకు పోకుండా పశువులను కాపాడారు. ఆయన అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచారు.
ఇక ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రజా దర్బార్ చేపట్టారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని తన నివాసంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఆయా దరఖాస్తులను శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి పంపించారు. వెంటనే అప్ డేట్స్ ఇవ్వాలని సంబంధిత అధికారులను మంత్రి అనిత ఆదేశించారు.