సుప్రీం ధర్మాసనానికి థ్యాంక్స్
ఇన్నేళ్ల కల నెరవేరిందన్న కడియం
హైదరాబాద్ – మాజీ మంత్రి కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గురువారం కడియం మీడియాతో మాట్లాడారు. సుప్రీం తీర్పుతో అణగారిన వర్గాలకు ఇకనైనా న్యాయం చేకూరుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. ఈ తీర్పు రావడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి ఉందన్నారు.
ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు మంత్రిని పంపి.. ప్రత్యేక అడ్వకేట్ ని నియమించారని తెలిపారు. ఈ తీర్పుతో కోట్లాది మంది ఎస్సీ, ఎస్టీలకు మేలు చేకూరుతుందని అన్నారు కడియం శ్రీహరి. ఇదిలా ఉండగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బేలా త్రివేది ఒక్కరే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎందుకంటూ ప్రశ్నించారు. మొత్తంగా 6-1 తేడాతో చివరకు అంతిమ తీర్పు వెలువరించారు సీజేఐ చంద్రచూడ్ .
ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి సవరణలు చేయడం , అమలు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందన్న ధర్మాసనం.. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం వర్గీకరణ వర్తింప చేయడంలో తప్పు లేదని పేర్కొన్నారు.