బీఆర్ఎస్ నేతలు దళిత వ్యతిరేకులు
కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం
హైదరాబాద్ – ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి గురువారం సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది.
ఈ సందర్బంగా రాష్ట్ర శాసన సభలో ప్రసంగించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. గత 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చీఫ్ మందకృష్ణ మాదిగను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నో కష్టాలు పడి, మరెన్నో అవమానాలు భరించి ఉద్యమాన్ని నడిపించారని కొనియాడారు. ఆయన గనుక ఈ ప్రయత్నం చేయక పోయి ఉంటే ఇవాళ ఈ తీర్పు వచ్చి ఉండేది కాదన్నారు వేముల వీరేశం.
అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి మాదిగల రిజర్వేషన్ కోసం అనుకూలంగా ప్రయత్నం చేశారని తెలిపారు. ఆయనకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. మాదిగ వర్గీకరణపై మాట్లాడకుండా అడ్డుకుంటున్న బిఆరెస్ నాయకుల ఇళ్ల ముందు మాదిగలంతా చావు డప్పు కొట్టాలని మాదిగలకు పిలుపు ఇస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీ క్యాబినెట్ లో ఒక్క మాదిగ మంత్రి ఉన్నారా అని ప్రశ్నించారు. మొత్తంగా బీఆర్ఎస్ నేతలంతా దళిత వ్యతిరేకులంటూ మండిపడ్డారు వేముల వీరేశం.