తెలంగాణకు తలమానికం ముచ్చర్ల
నాలుగో అద్భుత నగరంగా మారుస్తాం
రంగారెడ్డి జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ , సికింద్రాబాద్ , సైబరాబాద్ లకు ధీటుగా దేశంలోనే అత్యున్నతమైన నగరంగా ముచ్చర్లను నాలుగో నగరంగా తీర్చి దిద్దుతామని అన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నిర్మిస్తామని చెప్పారు సీఎం.
ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటి వాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
కందుకూరు మీర్‌ఖాన్‌పేట్ వద్ద నెట్‌జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్‌లకు ముఖ్యమంత్రి ఏక కాలంలో శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నాలుగో నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు.
ఈ ప్రాంతంలో భూమి కోల్పోయిన ప్రజలు అధైర్య పడవద్దని. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఆ కుటుంబాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందన్నారు. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుందని అన్నారు. న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించి తీరుతామన్నారు.