ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ విద్య
ఏపీ ఐటీ అకాడెమీ సిఇఓ సుర్జీత్ సింగ్
అమరావతి – ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఐటీ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం సాంకేతిక పరంగా కీలకమైన ప్రాత పోషించే డిజిటల్ సపోర్ట్ విద్యను ఒక సంవత్సరం కాలం పాటు అందజేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సిఇఓ ఎన్. సుర్జీత్ సింగ్ తెలిపారు.
విద్యార్థులకు భారత దేశంలో పేరొందిన ఐటి కంపెనీల్లో ఒకటైన హెచ్ సి ఎల్ కంపెనీ డిజిటల్ విద్యను అందించడమే కాకుండా ఉపాధి కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఉపాధి పొందుతూనే విద్యార్థులు ఉన్నత విద్యను సైతం పొందవచ్చుని పేర్కొన్నారు.
ఈ ఐటి విద్యను పొందడానికి విద్యార్థులు ఇంటర్ మీడియట్ తత్సమాన కోర్సు ను 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండాలని స్పప్టం చేశారు. విద్యార్థినీ విద్యార్థులు తప్పనిసరిగా ఒకేషనల్, సిఇసి, హెచ్ ఇ సి, బైపీసీ గ్రూప్ లలో చదివి ఉండాలని పేర్కొన్నారు.
ఏడాది కాలం పాటు టెబ్బీ ప్రోగ్రాం కు ఎంపిక అయిన అభ్యర్థులు శిక్షణ అనంతరం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధి పొందేందుకు వీలవుతుందని తెలిపారు సిఇఓ. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట హెచ్ సి ఎల్ కెరీర్ ఆప్టి ట్యూడ్ టెస్ట్ ఉంటుందని, అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇంటర్ వ్యూ ఉంటుందన్నారు.
ఇంటర్ వ్యూ లో ఎంపికైన అభ్యర్థులకు కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుందన్నారు. ఈ ప్రక్రియల్లో విజయం సాధించిన విద్యార్థులకు నియామక పత్రం అందించడం జరుగుతుందని సిఇఓ చెప్పారు. అభ్యర్థులకు ఏడాది కాలం పాటు మధురై, చెన్నై నగరాల్లో నెలకొన్న హెచ్ సి ఎల్ కేంద్రాల్లో శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపారు.
మూడు నెలల పాటు తరగతి గదులలో శిక్షణ, మిగిలిన 9 నెలలు ఇంటర్న్ షిప్ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులకు నెలకు 10 వేల రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఎంపిక అయిన వారికి సంవత్సరానికి రూ. 1.7 లక్షల వేతనం ఉంటుందని పనితీరు ఆధారంగా ప్రతీ సంవత్సరం వేతనంలో పెంపు ఉంటుందని తెలిపారు.
హెచ్ సి ఎల్ లో ఉద్యోగం చేస్తూనే శాస్త్ర, అమిటీ, కెఎల్ యూనివర్సిటీలలో ఉన్నత విద్య చేసుకునే అవకాశం సైతం ఉన్నదని చెప్పారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ కోసం registrations.hcltechbee.com ను వీక్షించాలని సూచించారు.
2024 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సిఇఓ చెప్పారు. ఇతర వివరాలకు 9642973350, 7780323850, 7780754278, 6363095030 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
జిల్లాల వారీగా కృష్ణా జిల్లాలో ఆగష్టు 6న, నెల్లూరులో ఆగష్టు 8న, గుంటూరు, ప్రకాశం, చిత్తూర్ లలో ఆగష్టు 9న, కడపలో ఆగష్టు 10న, కర్నూలులో ఆగష్టు 13న, అనంతపురంలో ఆగష్టు 17న, పశ్చిమ గోదావరిలో ఆగష్టు 19న, తూర్పు గోదావరిలో ఆగష్టు 20న, విశాఖలో ఆగష్టు 22న, విజయనగరంలో ఆగష్టు 23న, శ్రీకాకుళంలో ఆగష్టు 24 తేదీలలో ఐటి కోర్సు లలో ఎంపికకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని సిఇఓ తెలిపారు