ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ
ప్రకటించిన వైసీపీ బాస్ , మాజీ సీఎం జగన్
అమరావతి – వైఎస్సార్సీపీ బాస్ , మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బంపర్ ఛాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఉమ్మడి విశాఖ పట్టణం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడికి సంబంధించి తమ పార్టీ తరపున అభ్యర్థిగా బొత్స ను ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇవాళ తాడేపల్లిగూడెంలోని తన నివాసంలో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించామని, దీనికి ఎవరైనా అభ్యంతరం ఉంటే తెలపాలని కోరారు జగన్ మోహన్ రెడ్డి.
జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు , బాధ్యులతో అభిప్రాయాలను స్వీకరించారు మాజీ ముఖ్యమంత్రి. హాజరైన వారిలో పార్టీకి చెందిన ఏ ఒక్కరు బొత్సను ప్రకటించడంపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.
దీంతో బొత్స సత్యనారాయణ ఎంపికకు మార్గం సుగమమైంది. సమావేశం అనంతరం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు.