ఎలక్టోరల్ బాండ్లపై విచారణకు తిరస్కరణ
జోక్యం చేసుకోవడం తొందరపాటేనన్న కోర్టు
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్లపై సిట్ తో దర్యాప్తు చేసేందుకు ఒప్పుకునేది లేదంటూ స్పష్టం చేసింది. శుక్రవారం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన కేసుపై విచారణ జరిగింది.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ దాతల మధ్య క్విడ్ ప్రో కో జరిగిందని పలు పిటిషన్లు నమోదయ్యాయి. అంతేకాకుండా న్యాయ స్థానం పర్యవేక్షించాలని, సిట్ తో దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.
ఈ మొత్తం పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే సిట్ విచారణ చేపట్టాలని ఆదేశించడం కుదరదని పేర్కొంది. సాధారణ చట్టం కింద చర్యలు తీసుకునే మార్గాలు ఉన్నప్పటికీ దీనిపై మాజీ చీఫ్ జస్టిస్ తో విచారణ చేపట్టాలని ఆదేశించ లేమంటూ స్పష్టం చేసింది.
ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం కూడా తొందర పాటే అవుతుందని అభిప్రాయ పడింది సుప్రీంకోర్టు ధర్మాసనం.