ఎమ్మెల్యేనా..రౌడీ షీటరా..?
సీఎం గారూ ఇదేం భాష
హైదరాబాద్ – బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా దేవాలయంగా భావించే అసెంబ్లీ సాక్షిగా భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఉద్దేశించిన వాడిన భాషపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిమ్మకుండి పోవడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ఇలాంటి వాళ్లను సభలో ఎలా మాట్లాడిస్తారంటూ ప్రశ్నించారు. మాట్లాడుతున్న సమయంలో మైకును కట్ చేయాల్సిన స్పీకర్ అలాంటిది ఏమీ చేయకుండా మౌనంగా ఉండి పోవడం దేనికి సంకేతమని మండిపడ్డారు రాకేశ్ రెడ్డి.
ఒక రకంగా రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, వ్యవస్థలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడేందుకేనా నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది అంటూ దానం నాగేందర్ పై ఫైర్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బేషరతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.