వైసీపీ నేతల పై హైకోర్టు షాకింగ్ కామెంట్స్
దాడిని ఏ విధంగా చూడాలో మీరే చెప్పండి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వైఎస్సార్సీపీ నేతలను నిలదీసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై నేతలు దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలో మీరే చెప్పాలంటూ మండిపడింది. ముందు దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. ఇవాళ టీడీపీ పార్టీ ఆఫీస్ దాడికి సంబంధించిన కేసుపై విచారణ చేపట్టింది.
తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టుకు ఎక్కడాన్ని సీరియస్ గా తీసుకుంది. ప్రజాస్వామ్య దేశంలో ఓ పార్టీకి చెందిన వందల మంది కార్యకర్తలు మరో పార్టీ కార్యాలయంపై దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలో మీరే చెప్పాలని ప్రశ్నించింది.
ముందస్తు బెయిలు కోసం వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఆ పార్టీ కార్యకర్తలు జి రమేష్, షేక్ రబ్బాని బాషా, చిన్నాబత్తిన వినోద్ కుమార్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎల్ రవిచందర్, పి వీరారెడ్డి, న్యాయవాది వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు.