అక్టోబర్ లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ప్రత్యేక దర్శనాలు..ఆర్జిత సేవలు రద్దు
తిరుమల – టీటీడీ కీలక ప్రకటన చేసింది. వచ్చే అక్టోబర్ లో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈవో జె. శ్యామల రావు. ఇదిలా ఉండగా ఇంకా రెండు నెలల సమయం ఉన్నందున, మహా ధార్మికోత్సవాలకు సన్నద్ధం కావాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్‌నెస్, లడ్డూ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, టీటీడీ విజిలెన్స్, భద్రతా విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసులతో దీక్ష, కల్యాణకట్ట, రవాణా, హెచ్‌డిపిపి, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, సామగ్రి, శ్రీవారి సేవకులు తదితర అంశాలపై చర్చించారు.
వార్షిక బ్రహ్మోత్సవంలో ముఖ్యమైన రోజులలో అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం.. ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహనములు ప్రారంభమవుతాయి.
గరుడ సేవ కోసం యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున, అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలులోకి వస్తుంది.
సీనియర్ సిటిజన్లు-వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, శిశువులు ఉన్న తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఎస్‌విబిసి సిఇఓ షణ్ముఖ్ కుమార్, సిఇ నాగేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.