7న వీసీకే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
ప్రకటించిన జిలుకర శ్రీనివాస్
హైదరాబాద్ – విముక్త చిరుతల కచ్చి (వీసీకే) తెలంగాణ రాష్ట్ర చీఫ్ జిలుకర శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణలో ఉపకులాల వాటాను నిర్ణయించాలని. సామాజిక న్యాయం అందరికీ జరగాలని, రిజర్వేషన్లను ఒక సాధనంగా రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు.
రిజర్వేషన్ పాలక వర్గాల బిక్ష కాదని, అది ఈ దేశ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు జిలుకర శ్రీనివాస్. ఈ హక్కు కొన్ని బలమైన వర్గాల వరకే ఆగి పోకూడదని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సమ న్యాయం కోసం కావాలంటూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని తెలిపారు జిలుకర శ్రీనివాస్.
ఎస్సీలంటే కేవలం మాల, మాదిగ కులాలు మాత్రమే కావని, ఈ రెండు కులాలకు అనుబంధంగా, ఆశ్రితంగా వున్న ఉప కులాలు వున్నాయని గుర్తించాలని అన్నారు. ఈ ఉపకులాలు ప్రధానంగా వృత్తి ఆధారంగా వున్నాయని తెలిపారు. ఆ వృత్తులు సంస్కృతి, కళలతో ముడి పడి ఉన్నాయని పేర్కొన్నారు.
మాల ఉప కులాలతో పాటు మాదిగ ఉప కులాలు ఎప్పుడూ అన్యాయానికి గురవుతూనే వున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఎస్సీ రిజర్వేషన్ లో ఉప కులాల వాటా, కోటా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మాల ఉప కులాలను ఒక గ్రూపుగా, మాదిగ ఉప కులాలను ఒక గ్రూపుగా, మాదిగ ఒక గ్రూపుగా, మాల ఒక గ్రూపుగా కేటగిరైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పుడు మాత్రమే ఉప కులాలకు న్యాయం జరుగుతుందని విముక్త చిరుతల కచ్చి పార్టీ భావిస్తున్నదని స్పష్టం చేశారు జిలుకర శ్రీనివాస్. ఇదే విషయాన్ని విసికె జాతీయ అధ్యక్షులు తొల్.తిరుమవళవన్ కుండ బద్దలు కొట్టారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆగష్టు 7 వ తేదీన మధ్యాహ్నం 1-30 గంటలకు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని సంఘాలు, పార్టీలతో ఈ అంశం మీద అందరి అభిప్రాయాలను పంచు కోవడానికి రౌండు టేబులు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు జిలుకర శ్రీనివాస్.