చీర ధరించడం సాంప్రదాయానికి దర్పణం
ఏపీ మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్
విశాఖ పట్టణం – చీరలను ధరించడం అనేది అనాది నుంచి వస్తోందని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆదివారం విశాఖ పట్టణం నగరంలో ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆద్వర్యంలో బీచ్ రోడ్డులో హ్యాండ్లూమ్ సారీ వాక్ చేపట్టారు. ఈ సారీ వాక్ కార్యక్రమాన్ని వంగలపూడి అనిత ప్రారంభించారు.
చీర కట్టడం వల్ల హుందాతనం వస్తుందని, అందులో అమ్మ తనం కనిపిస్తుందని చెప్పారు హోం శాఖ మంత్రి. భారత దేశం అంటేనే ముందుగా గుర్తు వచ్చేది చీరేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రెండ్ మారినా చీర కట్టులో ఎలాంటి మార్పు రాలేదన్నారు. చాలా మంది విదేశీ సంస్కృతికి అలవాటు పడినా చివరకు మనకు ఆదర్శ ప్రాయంగా మారిన చీరకట్టునే ఎక్కువగా ఇష్ట పడుతున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా చీరలు నేయడంలో చేనేత కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు వంగలపూడి అనిత. ఇలా శారీ వాక్ ను నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నట్లు తెలిపారు. భావి తరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఒక చీర నేసేందుకు 20 రోజుల సమయం పడుతుందన్నారు.