NEWSANDHRA PRADESH

ఇళ్ల నిర్మాణంలో అవినీతిపై విచార‌ణ

Share it with your family & friends

ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్ట‌మ‌న్న మ‌నోహ‌ర్

అమ‌రావ‌తి – ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ప్ర‌భుత్వ భూములు అన్యాక్రాంతం కావ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో పేద‌ళ ఇళ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాలపై విచార‌ణ చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఎవ‌రున్నా, ఎంత‌టి వారైనా వదిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

ఆయ‌న తెనాలి నియోజకవర్గంలోని పెదరావూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం ఉద్దేశించిన లే అవుట్లను, అక్కడి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లు, గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడిన‌ట్లు పెద్ద ఎత్తున త‌మ‌కు ఫిర్యాదులు అందాయ‌ని చెప్పారు.

సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామ‌ని స్పష్టం చేశారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు నిలిపి వేసిన కాంట్రాక్టర్లకు రెండు వారాల గడువు ఇస్తున్నామ‌ని అన్నారు. పనులు మొదలు పెట్టక పోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియదని చెప్పడంతో మనోహర్ విస్తు పోయారు. లబ్ధిదారులకు వారి స్థలాలు తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలు వారం రోజుల్లో విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.