హత్యా రాజకీయాలు మానుకోవాలి
కాటసాని రాంభూపాల్ రెడ్డి వార్నింగ్
అమరావతి – వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. రోజు రోజుకు హత్యా రాజకీయాలు పెరిగి పోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక ప్రధానంగా తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నంద్యాల జిల్లా సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బరాయుడు దారుణ హత్యకు గురయ్యారు. సుబ్బరాయుడు మృత దేహానికి ఎమ్మెల్యేలు విరూపాక్షి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్, మాజీ ఎమ్మెల్యే శిక్రపాణి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అని కూడా చూడకుండా టీడీపీ నాయకులే హత్య చేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే సుబ్బారాయుడి హత్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలు హత్యారాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా దాడులు మానుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరించారు.