ఏసీఏ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ
ప్రకటించిన ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ – బెజవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించినట్లు విజయవాడ ఎంపీ, కర్నూల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎసిఏ ప్రత్యేక సర్వ సభ సమావేశం బందరు రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్ లో జరిగింది.
ఈ సమావేశం అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పాత బోర్డ్ సభ్యుల రాజీనామాలు ఆమోదించటం జరిగిందని, అలాగే వారు ఎసిఏ కి చేసిన సేవలకి కృతజ్ఞతగా సన్మానించటం జరిగిందని చెప్పారు.
మరో నెల రోజుల్లో ఎసిఏ ఎన్నికలు జరుగుతాయని, ఈ నెల రోజులు ఎసిఏ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ లో మాజీ మంత్రి ఆర్.వి.ఎస్.కె రంగరావు , మ్యాన్ చో ఫేరార్ , జాగర్ల మూడి మురళీ మోహన్ రావు సభ్యులుగా వుంటారన్నారు.
అనంతరం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో క్రికెట్ స్టేడియాల పరిస్థితి పై, క్రికెట్ ప్లేయర్స్ సదుపాయలపై చర్చించినట్లు తెలిపారు. ఈ అంశాలకు సంబంధించి పలు సలహాలు,సూచనలు అందించినట్లు ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు.
ఈ సమావేశంలో ఎసిఏ మాజీ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి , మాజీ జాయింట్ సెక్రటరీ రాకేష్, మాజీ మంత్రి ఆర్.వి.ఎస్.కె రంగరావు, సానా సతీష్, మాజీ కోశాధికారి చలం వివిధ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రటరీలు పాల్గొన్నారు.