NEWSTELANGANA

తెలంగాణ‌కు రండి పెట్టుబడులు పెట్టండి

Share it with your family & friends

ఎన్నారైల‌కు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా న్యూ జెర్సీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌వాసుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అమెరికాకే కాదు తెలంగాణ‌కు కూడా మీరు ఆయువుప‌ట్టు అని కొనియాడారు. వెంట‌నే త‌మ రాష్ట్రానికి రావాల‌ని, విస్తృతంగా పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు సీఎం.

ప్ర‌వాసుల ఆత్మీయ స‌మ్మేళ‌నం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌న్నారు . తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుందన్నారు. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ద‌క్కుతుంద‌ని చెప్పారు రేవంత్ రెడ్డి. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుందని పేర్కొన్నారు.

గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికాకు వచ్చానని తెలిపారు. పదేండ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పానని అన్నారు. తాను ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాన‌ని చెప్పారు సీఎం.

ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీతో పాటు, ఇన్ పుట్ సబ్సిడీగా రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, ఉపాధ్యాయులకు పదోన్నతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే అని.. భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.