NEWSTELANGANA

ప్ర‌జా సంక్షేమం అభివృద్దే ల‌క్ష్యం

Share it with your family & friends

అపోహ‌లు వీడండి స‌హ‌క‌రించండి

అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యుఎస్ టూర్ లో భాగంగా ఆయ‌న న్యూ జెర్సీలో జ‌రిగిన ఎన్నారైల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొని ప్ర‌సంగించారు. తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యమిస్తామని చెప్పారు.

ఎన్నికల ముందు త‌మ‌పై ఎంతో విష ప్రచారం జరిగిందన్నారు.. గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదని అన్నారని, ఒక‌వేళ వచ్చినా అది ఉండనే ఉండదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సీఎం. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధి చెప్పామ‌న్నారు. అబద్ధాలకోరుల మాటలు తప్పని మరోసారి నిరూపిస్తామ‌న్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతామ‌ని ప్ర‌క‌టించారు.

మీ నైపుణ్యాలు, మీ ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని ప్రవాసులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇకపై తెలంగాణకు మీ సేవలు అందించాలని స్వాగతించారు. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్ తో పాటు , సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని చెప్పారు.