నాగార్జున సాగర్ ప్రాజెక్టు కళ కళ
పోటెత్తుతున్న వరద ప్రవాహం
నల్లగొండ జిల్లా – భారీ ఎత్తున కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, కాలువలు నీళ్లతో నిండి పోయాయి. మరో వైపు ప్రాజెక్టులన్నీ జళకళను సంతరించుకున్నాయి.
ఇక నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం చోటు చేసుకుంది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఇన్ ఫ్లో 3,17,558 క్యూసెక్కులు ఉండగా , ఔట్ ఫ్లో 3,40,932 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 584.50 అడుగులు ఉండగా పూర్తి స్థాయి ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 298.9925 టీఎంసీలుగా నమోదైందని నీటి పారుదల శాఖ వెల్లడించింది.
ఎవరూ కూడా ప్రాజెక్టు నీటి విడుదల సమయంలో దగ్గరగా రాకూడదని హెచ్చరించారు. రైతులు ఈ విషయం గమనించాలని కోరారు.