SPORTS

ఫోగ‌ట్ నువ్వు నిజ‌మైన ఛాంపియ‌న్

Share it with your family & friends

ప్ర‌శంస‌లు కురిపించిన పీఎం మోడీ

న్యూఢిల్లీ – భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కీలక వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ వేదిక‌గా జ‌రిగిన రెజ్లింగ్ పోటీల‌లో 50 కేజీల విభాగంలో భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ ఫైన‌ల్స్ కు చేరింది. కాగా తాజాగా ఫోగ‌ట్ కు చేసిన ప‌రీక్ష‌ల్లో ఉండాల్సిన బ‌రువు క‌న్నా 100 గ్రాములు ఎక్కువ‌గా ఉంద‌ని తేలింది.

దీంతో పోటీ నిర్వాహ‌కులు ఆమెను అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించారు. ఫైన‌ల్ లో పోటీ చేసేందుకు వీలు లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో తీవ్ర నిరాశ‌కు లోనైంది వినేశ్ ఫోగ‌ట్. త‌ను ఎంతో క‌ష్ట‌ప‌డి పారిస్ ఒలింపిక్స్ కు చేరుకుంది. అద్బుత‌మైన ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌పంచ ఛాంపియ‌న్ ను ఓడించింది.

ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి బ‌రువు కార‌ణంగా వేటు ప‌డ‌డంతో ఒక్క‌సారిగా షాక్ కు లోనైంది. యావ‌త్ భారత దేశ‌మంతా ఈ నిర్ణ‌యంతో అవాక్క‌యింది. విష‌యం తెలుసుకున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బుధ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

పారిస్ ఒలింపిక్స్ లో నువ్వు ప్ర‌ద‌ర్శించిన తీరు అద్భుతం. వినేశ్ ఫోగ‌ట్ నువ్వు చాంపియ‌న్ల‌కే ఛాంపియ‌న్ వి అంటూ కొనియాడారు. నీ స్పూర్తి ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంద‌న్నారు.