ఐఓఏ చీఫ్ పీటీ ఉషతో మాట్లాడిన పీఎం
వినేష్ ఫోగట్ అనర్హతపై గురించి ఆరా
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ ఓవర్ వెయిట్ (అధిక బరువు) కారణంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడంపై స్పందించారు. వినేష్ ఫోగట్ నిజమైన ఛాంపియన్ అని కొనియాడారు. యావత్ దేశం తనకు మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు పీఎం మోడీ.
బుధవారం ప్రధాన మంత్రి ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన స్పందనను తెలియ చేశారు. ఇదిలా ఉండగా పారిస్ ఒలింపిక్స్ లో ఇవాళ వినేశ్ ఫోగట్ కు బరువు పరీక్షలు నిర్వహించారు. ఉండాల్సిన దానికన్నా కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది ఒలింపిక్స్ కమిటీ.
దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. దీనిపై జోక్యం చేసుకోవాల్సిందిగా దేశ క్రీడా శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియాను ఆదేశించారు. స్వయంగా ప్రధాన మంత్రి మోడీ భారత ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ) చీఫ్ పీటీ ఉషతో మాట్లాడారు.
వినేష్ ఫోగట్ అనర్హత కేసులో సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని, అవసరమైతే కావాల్సిన సాయం చేస్తామని హామీ ఇచ్చారు మోడీ.