సామాజిక రుగ్మతలపై గళమెత్తాలి
పిలుపునిచ్చిన మండలి బుద్ద ప్రసాద్
గుంటూరు – సామాజిక , రాజకీయ , సాంస్కృతిక రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు తమ ఆట, పాటల ద్వారా ఉద్యమించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్. ప్రజలను చైతన్యవంతం చేసి పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు.
గుంటూరులోని అన్నమయ్య కళా వేదిక లో పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మండలి బుద్ధ ప్రసాద్ ప్రసంగిస్తూ స్వతంత్ర ఉద్యమంలో పాట ప్రముఖ పాత్ర పోషించిందన్నారు.
ఉద్యమాలకు ప్రాణం పోసేది పాట అని స్పష్టం చేశారు. సమాజ చైతన్య గీతాలు ప్రజలలో ఆలోచనలను రేకెత్తించి సమాజ మార్పుకు దోహద పడ్డాయని చెప్పారు..1990 నుండి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వివిధ కళా జాతాలను నిర్వహిస్తూ అక్షరాస్యత ఉద్యమం , సారా వ్యతిరేక ఉద్యమంతోపాటు శాస్త్రీయ భావజాల వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ 1990వ దశాబ్దంలో అంధ్రప్రదేశ్ లో జరిగిన అక్షరాస్యత ఉద్యమంలో షేక్ హబీబ్ మున్నీషా బేగం చదువు ప్రాధాన్యతను తెలిపే పాటలతో నిరక్షరాస్యులను చైతన్యవంతులను చేశారన్నారు. వే
లాదిమంది కళాకారులకు శిక్షణ ఇచ్చి ప్రతి గ్రామంలో అక్షర కళాయాత్ర నిర్వహణకు తోడ్పాడిన మహనీయురాలని కొనియాడారు. అక్షరాస్యత ఉద్యమ ఫలితంగా 1991 నుండి 2001 నాటికి 17 శాతం అక్షరాస్యత పెరిగిందన్నారు. ఓటరు మేలుకో అనే నినాదంతో త్వరలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రస్థాయి కళాజాతను ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలో నిర్వహించి ఓటింగ్ శాతం పెరుగుదలకు, సామాజిక , ఆర్థిక , రాజకీయ పరిస్థితుల పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తామన్నారు.