యూనివర్శిటీల ర్యాంకింగ్స్ మెరుగు పడాలి
ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి – రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ఆయన ఉన్నత విద్యా శాఖాధికారులతో సమీక్ష చేపట్టారు. గత ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్శిటీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు మంత్రి. ఇదే సమయంలో ర్యాంకింగ్స్ విషయంలో కేవలం మూడు యూనివర్శిటీలు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు నారా లోకేష్.
రాబోయే రోజుల్లో టాప్ 10 లో ఉండేలా చూడాలని, ఇందుకు పూర్తి దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పరంగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, ఇందులో భాగంగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు.
ఈ మేరకు తమ ప్రభుత్వం త్వరలోనే ప్రపంచంలోనే టాప్ లో ఉండే విధంగా గ్లోబల్ ఏఐ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చెప్పాలని సూచించారు నారా లోకేష్.