వినేష్ ఫోగట్ కు రాజ్యసభ సీటు ఇవ్వాలి
లేదా భారత రత్న ప్రకటించాలన్న ఎంపీ
కోల్ కతా – టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పారిస్ వేదికగా జరిగిన పోటీలలో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. తను ఎంతగానో కష్ట పడిందని, కానీ అనుకోని రాజకీయాల కారణంగా తను ఫైనల్ లో ఆడకుండానే వేటుకు గురి కావడం బాధకు గురి చేసిందన్నారు అభిషేక్ బెనర్జీ.
వినేష్ ఫోగట్ కు భారత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని, భారత రత్న లేదా రాజ్య సభ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు టీఎంసీ ఎంపీ.
ఆమె ఎదుర్కొన్న అపారమైన పోరాటాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వినేష్ ఫోగట్ కోసం మనం చేయగలిగింది ఇదే. ఏ పతకం అయినా ఆమె నిజమైన ప్రతిభను పూర్తిగా ప్రతిబింబించదని అన్నారు అభిషేక్ బెనర్జీ.
ప్రభుత్వం , ప్రతిపక్షాలు ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని అన్నారు.