పెట్టుబడులు పెట్టండి ప్లీజ్ – సీఎం
పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
అమెరికా – తెలంగాణ రాష్ట్రానికి దండిగా డబ్బులతో రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటి సర్వ్ అలయన్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు.
ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగ పడుతుందన్నారు.
రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ , మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
హైదరాబాద్ ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సెంటర్ గా మారుస్తామని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుందని చెప్పారు. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేయటంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు.
రాబోయే దశాబ్దంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఎంచుకున్నారని, ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసిరావాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.