అఖిలేష్ యాదవ్ షాకింగ్ కామెంట్స్
ఆదాయం గురించి ఐటీ..సీబీఐని అడగండి
ఉత్తర ప్రదేశ్ – సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆదాయం, ఆస్తుల గురించి కావాలంటే తనను కాదని సీబీఐ, ఐటీ శాఖలను అడగాలని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
నా బ్యాలెన్స్ షీట్స్ అన్నీ గత 20 ఏళ్లుగా వారే తనిఖీ చేస్తున్నారంటూ స్పష్టం చేశారు. ఇక అనుమానం ఎందుకు కలుగుతోందంటూ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులను, వ్యాపారవేత్తలను నిలదీస్తారా అని నిప్పులు చెరిగారు అఖిలేష్ యాదవ్.
ప్రజలకు సంబంధించి జరుగుతున్న సమావేశంలో ఇలాంటి చిల్లర ప్రశ్నలు వేస్తే ఎలా అని అసహనానికి గురయ్యారు. పార్టీకి సంబంధించి లేదా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల గురించి అడిగితే బావుంటుందని సూచించారు ఎస్పీ చీఫ్.
తన జీవితం తెరిచిన పుస్తకమని, గత కొన్నేళ్లుగా తన తండ్రితో పాటు తాను కూడా రాజకీయాలలో కొనసాగుతూ వచ్చామని అన్నారు. ఇవాళ తనతో పాటు తన భార్య కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోందని తెలిపారు.