NEWSANDHRA PRADESH

నారా లోకేష్ ప్ర‌జా ద‌ర్బార్

Share it with your family & friends

23వ రోజుకు చేరుకున్న వైనం

అమ‌రావ‌తి – ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ దూకుడు పెంచారు. ఆయ‌న గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగానే త‌ను ప్ర‌తి రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో శుక్ర‌వారం కూడా ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా నారా లోకేష్ చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం ఇవాల్టితో 23వ రోజుకు చేరింది. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దౌర్జన్యాలు, కబ్జాల బాధితులు తమకు న్యాయం చేయాలని ఈ సంద‌ర్బంగా మంత్రి లోకేష్ ను కోరారు.

ప్ర‌ధానంగా పెన్ష‌న్లు, పెండింగ్ బిల్లుల కోసం వినతులు ఎక్కువ‌గా వ‌చ్చాయి. బాధితులు ఇచ్చిన వినతుల‌ను ప‌రిశీలించి త‌గు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు . ఇదే స‌మ‌యంలో ఆయా శాఖ‌ల‌కు సంబంధించి ఉన్న‌తాధికారుల‌కు ప‌రిష్కారం కోసం పంపించారు నారా లోకేష్‌.

గ‌త ప్ర‌భుత్వం చేసిన నిర్వాకం కార‌ణంగా ఇవాళ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆరోపించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డ‌మే కాకుండా రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించాడ‌ని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డిపై.