తిరుమలలో ఘనంగా గరుడ పంచమి
భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుమలలో గరుడ పంచమి పర్వ దినాన్ని అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. భారీ ఎత్తున శ్రీవారి భక్తులు పాల్గొని స్వామి వారి కరుణ కటాక్షానికి పాత్రులయ్యారు.
గరుడ పంచమి సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి వారు తమ ఇష్ట వాహనమైన గరుడునిపై తిరు మాడ వీధులలో విహరించారు..భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
రాత్రి కన్నుల పండువగా గరుడ వాహన సేవ జరిగింది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడుని లాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.
గరుడ వాహనసేవలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివి అండ్ ఎస్ ఓ శ్రీధర్, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.