సర్కార్ బడులు సత్తా చాటాలి – లోకేష్
సాల్ట్ ప్రాజెక్టు అమలు తీరుపై కామెంట్
అమరావతి – ఏపీలో విద్యా పరంగా మరిన్ని సంస్కరణలకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖా మంత్రి నారా లోకేష్. ప్రైవేట్ బడుల కంటే మెరుగైన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు నారా లోకేష్.
ప్రభుత్వ బడులు రాజకీయాలకు నెలవుగా ఉండ కూడదని , అవి సరస్వతీ నిలయాలుగా మారాలని ఆదేశించారు . పేరెంట్స్ కమిటీల ఏర్పాటు ముఖ్యమన్నారు. పిల్లల్లో మానసికంగా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత పంతుళ్లపై ఉందన్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫార్మేషన్ (SALT) ప్రాజెక్టు అమలు తీరుపై పాఠశాల విద్య అధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో సమీక్షించారు నారా లోకేష్.
రాబోయే ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.