NEWSTELANGANA

కుక్క‌ల విహారం ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయ‌ని స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయ‌ని, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై దాడి చేశాయ‌ని తెలిపారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాల పాలై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘ‌ట‌న‌లు ఉన్నాయ‌ని వీటి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని ఆరోపించారు.

బ్రతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయ‌ని తెలిపారు. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయ‌ని వాపోయారు.

కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గడిచిన ఎనిమిది నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావన్నారు.