బందరులో మెరైన్ యూనివర్శిటీ
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి
అమరావతి – ఆక్వా రంగంలో రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారుస్తామని అన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. మత్స్య కారుల ఆదాయం పెంచేలా కృషి చేస్తామన్నారు. సీడ్ కావాలంటే ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి నెలకొందన్నారు.
జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రం సర్వ నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు కొల్లు రవీంద్ర. బందరులో మెరైన్ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. మచిలీపట్టణాన్ని రాష్ట్రానికి ఆక్వా రాజధానిగా మారుస్తానంటూ ప్రకటించారు మంత్రి.
గిలకలదిండిలో ఫిషింగ్ హార్బర్లో వాతావరణ పరిస్థితులు, ఫిషింగ్ కోసం మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్‌కు చెందిన ఏడుగురు సభ్యుల బృందంతో పరిశీలించారు. మత్స్య ఉత్పత్తులకు మచిలీపట్నం పేరు పొందిందని చెప్పారు.
తీర ప్రాంతానికి రక్షణగా నిలిచే మడ అడవుల్ని జగన్ రెడ్డి నాశనం చేశాడని ఆరోపించారు కొల్లు రవీంద్ర. మత్స్య సంపద ఎదుగుదలకు మడ అడవులు ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాద్యత అందరిపైనా ఉందన్నారు.
సంప్రదాయ వనరుల స్థానంలో పునరుత్పాదక ఇందన వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలా దేశాల్లో సోలార్ పవర్డ్ బోట్స్ అందుబాటులోకి వచ్చాయని, మనం కూడా ఆ సాంకేతికతను వినియోగించు కోవడానికి ప్రయత్నించాలన్నారు.