ఎస్సీ..ఎస్టీ క్రీమీలేయర్ విషయంలో మౌనమేల..?
కాంగ్రెస్ పార్టీని నిలదీసిన బీఎస్పీ చీఫ్ మాయావతి
ఉత్తర ప్రదేశ్ – బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ క్రీమీలేయర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదంతా కేవలం రాజకీయ కోణంలో చూస్తే దళితులు, బహుజనులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం అనేది ఆ పార్టీకి ఇష్టం లేదని తేలి పోయిందన్నారు కుమారి మాయావతి.
లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని కాపాడతామంటూ ప్రగల్భాలు పలికారని, అంతే కాకుండా రాహుల్ గాంధీ పదే పదే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను ఉదహరించడం, ఆయన రాసిన రాజ్యాంగపు పుస్తకాన్ని ప్రదర్శించడం కేవలం ఓట్ల కోసమేనని ఆరోపించారు మాజీ సీఎం.
ఇక నుంచి నటించడం మానుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి మీ స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు మాయావతి. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించేందుకు పూర్తిగా విరుద్దమన్నారు. ఈ సందర్బంగా స్వాతంత్య్రానంతరం జరిగిన ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిన విషయం దేశానికి తెలుసన్నారు.