19 కంపెనీలు రూ. 31,532 కోట్లు
రానున్న 30,750 కొత్త ఉద్యోగాలు
అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో కొనసాగుతోంది. యుఎస్ టూర్ లో భారీ ఎత్తున కంపెనీలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా 19 కీలక కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ కంపెనీల కారణంగా దాదాపు రూ. 31,532 కోట్ల రూపాయలు పెట్టుబడిగా రానున్నాయి.
తెలంగాణ పెట్టుబడుల గమ్య స్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతం అయ్యింది సీఎం బృందం. కంపెనీల విస్తరణలో దాదాపు 30 వేలకు పైగా కొత్త వారికి, ప్రతిభ కలిగిన వారికి జాబ్స్ రానున్నాయని అంచనా వేస్తోంది సర్కార్.
రేవంత్ రెడ్డి బృందం ఆగస్టు 3న యుఎస్ఏకు వెళ్లింది. దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్, మూడు రౌండ్ మీటింగ్ లలో పాల్గొంది. ప్రధానంగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి.
ఈ పర్యటనలో కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
వీటితో పాటు హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పకోదగ్గ మైలు రాయిగా నిలిచింది. ముఖ్యమంత్రి బృందం యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.