మంత్రుల నిర్వాకం హరీశ్ రావు ఆగ్రహం
సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కొట్టేందుకు పోటీ
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగాట్టారు. ముఖ్యంగా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం తన్నీరు హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
సీతారామ ప్రాజెక్టు తమ హయాంలోనే జరిగిందని గొప్పలు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి హడావుడి చేసినట్టు సీతారామ ప్రాజెక్టు విషయంలో చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు హరీశ్ రావు.
నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నీ ఉత్త మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ప్రాజెక్టుకు అనుమతులు తామే తీసుకు వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆనాడు ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండ కూడదని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారని గుర్తు చేశారు.
ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చిందన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని తామే కట్టినట్టుగా గొప్పలు చెప్పుకోవడం దారుణం అన్నారు. ఇలాంటి వాళ్లనా తాము ఎన్నుకున్నది అని జనం విస్తు పోతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి.