కాంగ్రెస్ సర్కార్ పై టీజేఏసీ కన్నెర్ర
ఇచ్చిన హామీల అమలు జాడేది..?
హైదరాబాద్ – తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజేఏసీ) నిప్పులు చెరిగింది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. మాటలు కట్టబెట్టి వెంటనే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా జేఏసీ ఏర్పాటు చేయడం జరిగిందో ఇప్పుడు మళ్లీ జేఏసీ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని టీజేఏసీ నేతలు ఆరోపించారు.
ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా తమ సమస్యల గురించి ఊసెత్తడం లేదని వాపోయారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా త్వరితగతిన పీఆర్సీ ,టీఏ, డీఏ ను అమలు చేయాలని కోరారు.
నాలుగు డీఏ లు రావాల్సి ఉందని..గతంలో తాము రెండు డీఏ లు ఇవ్వకుంటేనే ధర్నాలు చేశామని..కానీ ఇప్పుడు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు.
సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ వెంటనే అమలు చేయాలని , ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలవాలని అనుకుంటే సీఎం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. 15 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు.