ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
బీఆర్ఎస్ నేత అనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో గురుకులాలు దారుణంగా తయారయ్యాయని, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు.
విషాహారం తిని కొందరు అస్వస్థతకు గురైతే, మరికొందరు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని అయినా ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా స్పందన లేక పోవడం దారుణమన్నారు రాకేశ్ రెడ్డి. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
అదే వారి పిల్లలకు ఏమైనా జరిగితే ఊరుకుంటారా అని నిలదీశారు. గత 8 నెలల్లో 36 మంది కల్తీ ఆహారం కారణంగా, పాము కాట్లు, ఆత్మహత్యల కారణంగా చనిపోయారని వాపోయారు. ఇంత జరిగినా ఒక్కరు కూడా పరామర్శించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం కొలువు తీరి 9 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు విద్యా శాఖకు మంత్రి లేక పోవడం ఏమని అనుకోవాలని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిత్యం ఢిల్లీకి, విదేశాలకు వెళ్లేందుకు సమయం ఉంటుందని , కానీ పిల్లల బాగోగుల గురించి పట్టించుకునే ఓపిక, తీరిక లేక పోవడం దారుణమన్నారు.