ఆంధ్రా డెయిరీలకు అందలం – శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ సర్కార్ పై మాజీ మంత్రి ఆగ్రహం
హైదరాబాద్ – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఆనవాళ్లు లేకుండా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్న అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాల రైతులు పరేషాన్ లో ఉన్నారని వాపోయారు. వారికి బిల్లులు చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
గతంలో పాడి పంటలు అనే వారని, కానీ ఇప్పుడు పాడి, పంట వేర్వేరు అయ్యాయని అన్నారు శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా పాలు పోస్తున్న రైతులకు బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ లో ప్రతి రోజూ 30 లక్షల లీటర్ల పాలు వినియోగిస్తారని , 5 లక్షల లీటర్లు తెలంగాణ నుంచి వస్తాయని అన్నారు.
తెలంగాణ డెయిరీకి మంగళం పాడి ఆంధ్రా కు చెందిన డెయిరీలను పెంచి పోషించే కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగతోందన్నారు శ్రీనివాస్ గౌడ్. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు లీటర్ కు 4 రూపాయలు ప్రోత్సాహకరంగా ఇచ్చామన్నారు. దాణాకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు.
విజయ డెయిరీలో 500 కోట్ల మేర పాల ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని , వాటిని యాదాద్రికో లేదా తిరుమలకు విక్రయిస్తే బావుంటుందని సూచించారు.