వేతనాలు ఇవ్వక పోతే ఆందోళన తప్పదు
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ
హైదరాబాద్ – తెలంగాణలో గురుకులాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంగళవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కావాలనే దళిత, బహజనుల బిడ్డలను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ప్రపంచ స్థాయికి ఎదిగిన సంక్షేమ గురుకుల పాఠశాల గౌలిదొడ్డిలో గత మూడున్నర నెలలుగా జీతాలు రావడం లేదని సబ్జెక్టు నిపుణులు, సీనియర్ ఫ్యాకల్టీ సమ్మె చేయడం దారుణమన్నారు. మళ్లీ దళిత ఇతర పీడిత జాతులను రాతి యుగం నాటి రోజులకు నెట్టే కుట్ర జరుగుతోందని వాపోయారు.
గత పాలనలో స్వర్ణ యుగం చూసి ప్రపంచ స్థాయికెదిగిన గురుకులాలు ఇప్పుడు మృత్యు కుహరాలుగా మారాయని అన్నారు. గురుకులాల్లో , సీవోఈ, క్రీడా అకాడెమీల్లో పని చేస్తున్న వారికి ఇంత వరకు వేతనాలు ఇవ్వక పోతే ఎలా అని ప్రశ్నించారు.
చైతన్యం కలిగిన ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, దళిత బహుజన విద్యార్థి సంఘాలు మన బిడ్డల భవిష్యత్ కోసం రోడ్డు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు ఆర్ఎస్పీ. వారి సమస్యను పరిష్కరించక పోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.