డిపోలు ప్రైవేట్ పరం ప్రచారం అబద్దం
స్పష్టం చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – ఆర్టీసీ లోని డిపోలను ప్రైవేట్ పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.
సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని తెలిపారు ఎండీ.
డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుపాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఇదే విధానంలో ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఒలెక్ట్రా కంపెనీతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ఒప్పందం చేసుకుని పుష్ఫక్ పేరుతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు ఎండీ.
హైదరాబాద్‌లోని కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోల నుంచి వాటిని తిప్పుతోందన్నారు. బస్సుల మెయిన్టనెన్స్, చార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోందని స్పష్టం చేశారు సజ్జనార్.
2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం (ఎన్‌ఈబీపీ) కింద 500 ఇంటర్ సిటీ బస్సులను టెండర్ ద్వారా జేబీఎం కంపెనీకి ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో 48 ఈ-సూపర్ లగ్జరీ బస్సులు ప్రస్తుతం రాగా.. వాటిలో 35 కరీంనగర్-2 డిపోకు, 13 నిజామాబాద్-2 డిపోనకు సంస్థ కేటాయించిందని తెలిపారు.
ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం అవసరమైన చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం డిపోల్లో పూర్తి కావస్తుండటంతో.. వాటిని త్వరలోనే ప్రారంభించేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు ఎండీ.
అలాగే, ప్రజల రవాణా అవసరాలు, కాలుష్య నివారణను దృష్టిలో పెట్టుకుని 2023లో 550 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లను సంస్థ పిలిచిందన్నారు. అందులో 500 సిటీ బస్సులు, హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం సిటీలో 74 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. విజయవాడ మార్గంలో ఈ-గరుడ పేరుతో 10 బస్సులు తిరుగుతున్నాయని, దశలవారీగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ అందుబాటులోకి తెస్తోందని తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంలో దేశ వ్యాప్తంగా అవలంభిస్తోన్న ఈవీ పాలసీనే 2019 నుంచి టీజీఎస్ఆర్టీసీ అమలు చేస్తోందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను నేరుగా కొనాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని పేర్కొన్నారు.
ప్రతి డిపో పరిధిలో రూరల్, అర్బన్, తదితర భిన్నమైన రూట్లు ఉంటాయని, ఎలక్ట్రిక్ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యం కాదన్నారు ఎండీ.