అన్న క్యాంటీన్లకు రూ. కోటి విరాళం
అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్దరించింది ఏపీ కూటమి ప్రభుత్వం. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఇస్కాన్ తోడ్పాటుతో ప్రభుత్వ సహకారంతో రాష్ట్రమంతటా తిరిగి అన్న క్యాంటీన్లను పునరుద్దరించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవాన్ని తీసుకు వస్తామని, లక్షలాది మంది పేదలు, సామాన్యులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు గాను చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆయన చెప్పినట్టుగానే ఇవాళ అన్న క్యాంటీన్లు కళ కళ లాడుతున్నాయి. వసతి సౌకర్యాలను మెరుగు పరుస్తామని, నాణ్యవంతమైన, రుచికరమైన టిఫిన్లతో పాటు మధ్యాహ్నం, రాత్రి పూట కేవలం రూ. 5 కే భోజనం అందజేస్తామని ప్రకటించారు.
ఇందులో భాగంగా భారీ ఎత్తున అన్న క్యాంటీన్లకు విరాళాలు సమకూరుతున్నాయి. తాజాగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. సంస్థ అధినేత విజయవాడకు చెందిన పెనుమత్స శ్రీనివాసరాజు సచివాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్ల పాటు ఇంతే మొత్తం లో విరాళం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను సీఎం చంద్రబాబు అభినందించారు.