దాడులు దారుణం జగన్ ఆగ్రహం
రెడ్ బుక్ పాలన చెల్లదన్న మాజీ సీఎం
అమరావతి – ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాచరిక పాలన సాగిస్తోందని సీరియస్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పనిగట్టుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, కేసులు నమోదు చేసి భయ భ్రాంతులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపి చివరకు తప్పు కోవడాన్ని ప్రస్తావించారు మాజీ ముఖ్యమంత్రి.
ఎన్ని కేసులు బనాయించినా, ఎన్ని దాడులకు తెగ బడినా తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, ఏదో ఒక రోజు తమను ఆదరించక తప్పదన్నారు.
అధికారం ఉంది కదా అని దాడులు చేసుకుంటూ పోతారా అని ప్రశ్నించారు మాజీ సీఎం. తాము ఢిల్లీలో కూడా ధర్నా చేపట్టామని, అన్ని పార్టీలు బేషరతుగా మద్దతు తెలిపారని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు జగన్ రెడ్డి.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని తాను అండగా ఉంటానని ప్రకటించారు.